Site icon Prime9

YSR Jayanthi: మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. అంటూ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్

YSR Jayanthi

YSR Jayanthi

YSR Jayanthi: వైఎస్సార్‌ ఆ పేరు వినగానే అశేష తెలుగు ప్రజలు హృదయాలు బరువెక్కుతాయి. ఆ పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్లకు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన కృషి ఎన్నటికీ మరిచిపోలేనిది. నేడు జూలై 8న వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకులు ఘనంగా జరుపుతున్నారు ఆయన అభిమానులు వివిధ పార్టీల నాయకులు. ఇక ఈ సందర్భంగా తన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలచుకుంటూ సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

మీ స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది(YSR Jayanthi)

‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు’’ అని సీఎం ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

ఇకపోతే వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు రాజశేఖరుడికి నివాళుర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. తదితరులు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సీఎం వైఎస్ జగన్ ఈ రోజు మధ్యాహ్నం తర్వాతనే వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే వైఎస్సార్ ఘాట్ వద్దకు వచ్చి జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొనేవారు. కానీ ఈసారి మాత్రం ఒకరికొకరు ఎదురు పడకుండా.. ఎవరికివారే వేర్వేరు సమయాల్లో నివాళులర్పించేలా ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది.

Exit mobile version