Site icon Prime9

CM Jagan: రాజధాని తరలింపుకు రంగం సిద్దం చేస్తున్న సీఎం జగన్

capital shift

capital shift

Andhra Pradesh: త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు కానుందా? అందుకోసం సీఎం జగన్‌ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారా? అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారా? కోర్టుల్లో కేసులు ఉండగా, విశాఖను రాజధాని చేస్తే, ఎదురయ్యే ఇబ్బందులేంటి? జగన్‌ పక్కా ప్లానింగ్‌తో రాజధానిని వైజాగ్‌కు షిఫ్ట్‌ చేస్తున్నారా?

విశాఖలో ముఖ్యమంత్రి హోదాలో తొలి నిద్ర చేశారు సీఎం జగన్ మోహన్‌రెడ్డి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల విశాఖ టూర్ కోసం వైజాగ్ వచ్చారు. ఒక రాత్రి ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి జగన్ సైతం విశాఖలో ఉండాల్సి వచ్చింది. అలా తొలి నిద్ర చేయడం ద్వారా విశాఖ రాజధాని మీద ఏర్పడిన ఆటంకాలను జగన్ తొలగించేసుకున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక విశాఖకు ఏ క్షణమైనా తన కార్యకలాపాలను షిఫ్ట్ చేసుకోవాలని జగన్ చూస్తున్నారు అని వార్త ఒకటి గట్టిగా ప్రచారం అవుతోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందువల్ల జగన్ తన కలల రాజధాని నుంచి పాలించేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇందుకు సంబంధించిన పనులను సీఎం జగన్‌ వేగవంతం చేయించారన్న టాక్‌ నడుస్తోంది.

అమరావతి ఏకైక రాజధాని అంటూ ఈ ఏడాది మార్చిలో హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దాంతో ఆరు నెలల పాటు ఆగిన జగన్ సెప్టెంబర్ లో సుప్రీంలో పిటిషన్ వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను స్వీకరించింది. కానీ అది వాయిదాలు పడుతోంది. లోతైన అధ్యయనం చేయాల్సి ఉన్నందువల్ల ఎపుడు ఈ కేసు పూర్తి అవుతుందో కూడా తెలియడంలేదు. ఈ నేపథ్యంలో జగన్ అయితే విశాఖకు తన పాలనను షిఫ్ట్ చేయాలని ఆరాటపడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. దాని కోసం ఒక మంచి ముహూర్తం ఆయన సెట్ చేసుకుని ఉన్నారని చెబుతున్నారు. ఇక రాజ్యాంగంలో రాజధానికి ఒక నిర్వచనం ఇవ్వలేదు. సీఎం కానీ, ప్రధాని కానీ ఎక్కడ నుంచి అయినా పాలించవచ్చు. ఫైల్స్ తమ వద్దకు రప్పించుకుని క్లియర్ చేయవచ్చు. ఇపుడు జగన్ కూడా అలాగే రాజధాని అని విశాఖకు పేరు పెట్టకుండా పాలించాలని చూస్తున్నారు అని అంటున్నారు పరిశీలకులు. అప్పుడు దాని మీద న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండబోవని రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ రకమైన స్వేచ్చ ముఖ్యమంత్రికి పూర్తిగా ఉందని అంటున్నారు. దీని వల్ల జగన్ కి రెండు లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి తాను కోరుకున్నట్లుగా విశాఖకు రాజధానిని మార్చడం. అదే విధంగా తాను ప్రజలకు చెప్పిన మేరకు విశాఖకు క్యాపిటల్ హోదా ఇచ్చి జనాలకు దగ్గర కావడం.

ఒకసారి క్యాపిటల్ కార్యకలాపాలు మొదలయ్యాక, భవిష్యత్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని తీసివేయలేరు. అంతే కాదు ప్రస్తుతం విశాఖ విషయంలో విభేదిస్తున్న విపక్షాలు కూడా రాజధాని అన్న పేరు లేకుండా ముఖ్యమంత్రి వెళ్ళి విశాఖ పాలిస్తూంటే ఏమీ అనలేరు. పైగా ఏ రకమైన విమర్శలు చేసినా అది వారికి రాజకీయంగా తిప్పికొడుతుంది. తాను అనుకున్నట్లుగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్లుగా జగన్ చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అయితే జగన్ రాజధాని అనకుండా విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి కార్యక్రమాలు అమలు చేయవచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కానీ హై కోర్టు విషయం అలా కాదు. దానికి సుప్రీం కోర్టు సిఫార్సు చేస్తే అంతిమంగా రాష్ట్రపతి ప్రకటించాల్సి ఉంటుంది. కర్నూల్ లో హైకోర్టు అన్నది మాత్రం అనుకున్నంత ఈజీ కాదట. ఇక శాసన రాజధానిగా అమరావతి ఎటూ ఉంటుంది.

Exit mobile version