Andhra Pradesh: ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. కొద్ది రోజులకిందట నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఇపుడు పోసానికి కూడ పదవి వరించింది. గత నెల రోజులుగా వీరిద్దరికి పదవులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజమయ్యాయి.
పోసాని కృష్ణమురళి చాలా కాలం నుంచి వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానాన్ని ప్రశంసించారు. అలానే అలీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోసాని వైసీపీ తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. గత ఎన్నికల్లో మోహన్ బాబు, పోసాని కృష్ణమురళి, థర్టీ ఈయర్స్ పృధ్వీ, అలీ, విజయ్ చందర్, భానుచందర్ తదితరు బాహటంగానే వైసీపీకి మద్దతు తెలిపారు. నాగార్జున వంటి వారు పరోక్షంగా సహకరించారు.
గుంటూరు జిల్లాకు చెందిన పోసాని కృష్ణమురళి టాలీవుడ్ లో రచయితా ప్రవేశించి తరువాత దర్శకుడు, నిర్మాత, నటుడిగా మారారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత బయటకు వచ్చేసారు. గతంలోనే ఆయనకు ఈ పదవి వస్తుందని ఊహాగానాలు అనేకసార్లు తెరమీదకు వచ్చాయి.