Janasena Activist : తిరుపతి జిల్లాలో జనసైనికులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్‌కు మద్దతుగా.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టిన జనసేన శ్రేణులు.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకునే చర్యల్లో భాగంగా అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ మరోసారి రెచ్చిపోయారు.
గతంలో పలు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన అంజు యాదవ్.. తాజాగా జనసేన నేతపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీకాళహస్తిలో జనసేన నేతలు చేపట్టిన నరసన కార్యక్రమంలో పార్టీ నేత సాయిపై.. సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. రెండు సార్లు చెంప చెల్లుమనిపించారు. దీంతో పోలీసులకు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఐ అంజు యాదవ్ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టుగా తిరుపతి జిల్లా జనసేన నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే గతేడాది శ్రీకాళహస్తిలో ఓ హోటల్ యజమానురాలిని సీఐ అంజు యాదవ్ బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఘటనతో సీఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో తిరుపతి ఎస్పీ అంతర్గత విచారణకు ఆదేశించారు.