Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు అన్నారు. విజయవాడ ఎన్టీఆర్ భవన్ సమీపంలో నిర్వహించిన తెదేపా లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు.. (Chandrababu Naidu)
ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరిగిన గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై ఆయన స్పందించారు. మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కుంటుంటే రాష్ట్రానికి పెట్టుబడులెలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సీఎం చేసే అరాచకాల నుంచి వైకాపా నేతల్ని కూడా తామే రక్షించాల్సి వస్తోందని విమర్శించారు. ఎంపీ రఘురామ రాజు, సుబ్బారావు గుప్తాలే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎవరు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులను ఉపేక్షించేది లేదని.. చేసిన తప్పులకు వారు కూడా శిక్ష అనుభవించాల్సిందేనని విమర్శించారు. రాష్ట్రంలో రావణ కాష్టం తరహా పరిస్థితులు ఉన్నాయని.. ఆ పరిస్థితులను నిర్మూలించడానికి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైకాపా అరాచకాల దెబ్బకు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు.
యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు..
యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర ఆగబోదని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు చేసే హక్కుందన్నట్లు ఉన్నతాధికారులే మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో తెదేపా శ్రేణులపై బనాయించిన అక్రమ కేసులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో రూ.40 వేల కోట్ల అక్రమాలకు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. విశాఖ నుంచే పాలన సాగిస్తానంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణగా పరిగణించవచ్చన్న న్యాయవాదులు.. కోర్టులో కేసు వేయాలని చంద్రబాబును కోరారు. సుప్రీం కోర్టులో ఉన్న రాజధాని అంశంపై మాట్లాడటం తప్పేనని చెప్పిన చంద్రబాబు.. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో త్వరలో సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశముందని చెప్పారు. జగన్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
సొంత నియోజకవర్గంలో అడ్డుకున్నారు.
సొంత నియోజకవర్గంలో తన పాదయాత్రను అడ్డుకోవడంపై చంద్రబాబు స్పందించారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేసే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు అన్నారు. దళిత డ్రైవర్‌ను చంపి అంత్యక్రియలు చేసుకోమనడం అహంకారమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు, హత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.