Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో లో మూడో రోజు పర్యటిస్తున్నారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మద్యాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని దుయ్యబట్టారు. బాబాయ్ వివేకను చంపిన వ్యక్తికి ఓట్లడిగే హక్కు లేదన్నారు. వైసీపీ ఆరిపోయే దీపమని, ఇకపై జగన్ ఆటలు సాగవన్నారు. టీడీపీ ధర్మ పోరాటానికి ప్రజల సహకారం అవసరమని చంద్రబాబు పిలుపిచ్చారు.
హంద్రీనీవా పనులు 90 శాతం పూర్తిచేసినా, మిగిలిన 10 శాతం పనులను వైసీపీ పూర్తి చేయలేకపోయిందన్నారు. టీడీపీ (TDP) కి పేరు వస్తుందన్న అక్కసుతోనే హంద్రీనీవా పనులు నిలిపివేశారని తప్పుబట్టారు. హంద్రీనీవా పనులను ఎందుకు నిలిపివేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పంలో జరిగిన దాడులు వైసీపీ నేతల దౌర్జన్యాలకు పరాకాష్టకు చేరుకున్నాయని మండిపడ్డారు. కుప్పం ఘటన పై ప్రైవేటు కేసులు వేస్తామని, దోషులను శిక్షించే వరకు పోరాడుతామని చంద్రబాబు ప్రకటించారు.