New Delhi: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుచేయాలని కోరుతూ సీబీఐ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి 16న కొట్టివేసింది. ఎర్రగంగిరెడ్డి సాక్షులను ప్రబావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలకు బలం చేకూరేలా సీబీఐ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించలేదు. దీనితో బెయిల్ రద్దు పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో సీబీఐ సోమవారం నాడు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని 2019 మార్చి 19వ తేదీన ఇంట్లోనే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అరెస్టైన ఎర్రగంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. ఈ కేసు విచారణను ఏపీ రాష్ట్రంలో కాకుండా మరో రాష్ట్రంలో చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.