Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏలూరు వేదికగా వాలంటీర్ల గురించి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సదరు వ్యాఖ్యల పట్ల ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు మహిళా కమిషన్ తాజాగా నోటీసు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది. దీనిపై 10 రోజుల్లోపు పవన్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారో సమాధానం చెప్పాలని అన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని విమర్శించారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని దుయ్యబట్టారు. పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.
రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీటు కోసం ఎవరినైనా ఫణంగా పెడతారా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా? అని సీరియస్ అయ్యారు. ఇక మరోవైపు పవన్ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పవన్ ( Pawan Kalyan ) దిష్టిబొమ్మను దహనం చేసి.. తమకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే వారాహి విజయ యాత్రలో భాగంగా నిన్న ఏలూరులో పవన్ (Pawan Kalyan)మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణా వెనుక వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారని.. వాలంటీర్లు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆరోపించారు. ‘‘వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని.. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని ఆరోపించారు.