Nara Chandrababu Naidu : తెదేపా చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 5 వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బుధవారం నాడు ఏసీబీ కోర్టు ప్రారంభం అయిన తర్వాత సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సాగుతున్నందున కొంత సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దాంతో ఇరువర్గాల న్యాయవాదులు మాట్లాడుకుని ఓ నిర్ణయం తీసుకున్నాక తన వద్దకు రావాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూచించారు.
కాగా లంచ్ బ్రేక్ తర్వాత ఈ రెండు పిటిషన్లపై విచారణకు ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించారు. ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చెప్పారు. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై విచారణ నిర్వహిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. మరోవైపు సుప్రీం కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు నోచుకోలేదు. దానిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి (ఎస్వీఎన్ భట్టి) విముఖత చూపారు. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విషయంపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. తన సహచర న్యాయమూర్తికి ఈ కేసు విచారణపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. కాగా వీలైనంత త్వరగా విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో వచ్చే వారమే విచారణ జరుగుతుందని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు.
ఒకవైపు చంద్రబాబును మరో ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఈ నెల 25న సీఐడీ తరపు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ నెల 14వ తేదీన పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ పిటీషన్లు మళ్ళీ వాయిదా పడడం గమనార్హం.