Purandeswari : రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జగన్ సర్కారు పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలన్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100 డిస్టలరీ కంపెనీలు నమోదయ్యాయని.. కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. 2019లో అదాన్ డిస్టలరీస్ రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా చేస్తుందని.. అదాన్ కంపెనీ వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారని పురందేశ్వరి ఆరోపించారు. అదే విధంగా ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డి ఉన్నారని పురంధరేశ్వరి దుయ్యబట్టారు. లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల లెక్కలేవని ఆమె ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని జగన్ సర్కారుపై ఫైర్ అయ్యారు.