Site icon Prime9

Ap Assembly: ఎమ్మెల్యేలను కొట్టడం ఏంటి?.. వారు మనుషులా? పశువులా?: సీపీఐ నారాయణ

Ap Assembly

Ap Assembly

Ap Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య జరిగిన సంఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.

‘ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి?.. వారు మనుషులా? పశువులా?.. బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉంది. నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరీ దొంగ ఓట్లు వేయించుకున్నారు.

అయినా సరే ఓడిపోవడంతో నిరాశలో కూరుకు పోయారు. అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు.

గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప.. ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు.

టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక పోతే.. కొడతారా?.. స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరిదీ ఈ ఘటనలో తప్పు ఉంది. స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలి.

అధికారం, ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు. రేపు నువ్వు అటు వైపు ఉంటావు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి.

దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం మాని, బాధితులను సస్పెండ్ చేయడం ఏంటీ..? ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు: అచ్చెెన్నాయుడు(Ap Assembly)

కాగా, ఏపీ అసెంబ్లీలో సోమవారం ఉదమం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

శాసనసభలో చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు.

ఈ క్రమంలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఫలితాల దృష్టి మళ్లించేందుకే(Ap Assembly)

75 ఏళ్ల వయసున్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

‘జీవో1 రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చాం.. దానికి స్పీకర్‌ అంగీకరించలేదు. మేం పోడియం దగ్గర నిరసన తెలిపాం. మేం తప్పు చేస్తే స్పీకర్‌ చర్యలు తీసుకుని మమ్మల్ని సస్పెండ్‌ చేయాలి.

పోడియంపైకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గూండాల మాదిరిగా వచ్చారు. ఇంత దారుణంగా ప్రత్యక్ష దాడి చేసి శాసనసభ పరువును జగన్ ప్రభుత్వం తీసింది.

పోడియం వద్దకు వైఎస్సార్సీపీ సభ్యులు రావాల్సిన అవసరమేంటి? శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారనే ఆందోళన వైఎస్సార్సీపీలో ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఓటమి నుంచి దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నేతలు ఈ విధంగా దాడి చేశారు’ అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Exit mobile version