Ambati Rambabu : ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఖమ్మంలో ఒక నిశ్చితార్థానికి వెళ్తే నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. హఠాత్తుగా పది మంది వచ్చి వేసేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న నాపైనే దాడి చేయాలని ప్రయత్నించారు. కానీ కొన్ని ఛానళ్ళు, టీడీపీ నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి సీరియస్ అయ్యారు.
అదే విధంగా దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం అని.. ఉన్మాదులపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని అంబటి స్పష్టం చేశారు. నిన్న నా కారుపై గోధుమల బస్తాలు పడటం, ఇవ్వాళ దాడికి యత్నించటంపై విచారణ జరగాలి అని కోరారు. గతంలో కార్తీక వనభోజనాల సమయంలో నన్ను చంపేసిన వారికి రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈరోజు దాడికి ప్రయత్నించిన వారిలో ఆరుగురిని అరెస్టు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినవారిపై కూడా దాడి చేస్తారా?. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాని హతమార్చారు. ముద్రగడ పద్మనాభం మీద కూడా దాడి చేశారు. ఇది ఎంత మాత్రం సహించరానిదని.. చంద్రబాబు మీద ప్రేమ ఉంటే అది వేరేలా వ్యక్తం చేసుకోండని.. అంతే కానీ దాడులు చేస్తామంటే మేము చేతులు కట్టుకుని కూర్చోమని అన్నారు.