Ambati Rayudu: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైసీపీకి షాకిచ్చారు. 2023 డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన అంబటి రాయుడు పది రోజులు కూడా తిరగకముందే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. తాను అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజకీయాలనుంచి కొంతకాలం దూరంగా ఉంటానని అంబటి రాయుడు తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తానని అంబటి రాయుడు చెప్పారు.
గుంటూరు ఎంపీ సీటు కోసం..(Ambati Rayudu)
వైసిపిలో చేరకముందు దాదాపు ఏడాది పాటు అంబటిరాయుడు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలని కలుసుకున్నారు. వారి కష్టసుఖాలని తెలుసుకున్నారు. ఏ పార్టీలో చేరేది చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచారు. చివరికి వైసిపి కండువా కప్పుకున్నారు. కానీ వైసిపితో ఆయన ప్రయాణం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసిపిలో చేరారు. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా శుక్రవారం జగన్ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ఏమాత్రం అంగీకరించని శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా అధిష్టానానికి చెప్పేశారు.ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చకి దారి తీసింది.