Ambati Rayudu: ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మంగళగిరి జననసేన పార్టీ ఆఫీస్‌కి వెళ్ళారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
టోర్నీలో ఆడేందుకే..(Ambati Rayudu)
డిసెంబర్ 28న అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. నాలుగు రోజుల క్రితం అంబటి రాయుడు వైసిపికి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారన్నది చెప్పలేదు. కానీ రెండు రోజుల తరువాత రాజీనామాకి గల కారణాలపై ట్వీట్ చేశారు. దుబాయ్‌లో జరిగే ఐఎల్ టి20 టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నానని అంబటి రాయుడు తెలిపారు. ప్రొఫెషనల్ టోర్నీలో ఆడేటప్పుడు రాజకీయాలు, పార్టీలతో సంబంధం ఉండకూడదు కాబట్టే రాజకీయాలకి కొంత కాలంపాటు దూరంగా ఉంటానని అంబటిరాయుడు తెలిపారు.