Chandrababu Fulfilled Vow:ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెండున్నరేళ్ల క్రితం అంటే 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు తీవ్రంగా కించపరిచారు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన చంద్రబాబు..అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. ముఖ్యమంత్రి హోదాలోనే మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెడతానని 2021లో శపథం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన భార్యను అవమానించి..తనను ఇష్టం వచ్చినట్లు దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతా..ఇది కౌరవ సభ..గౌరవ సభ కాదు..ఇలాంటి కౌరవ సభలో తాను ఉండను..ప్రజలందరూ తన అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం టీడీపీ కార్యాలయంం జరిగిన ప్రెస్‌మీట్‌లో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే రెండున్నరేళ్ల క్రితం చేసిన శపథం నేడు నెరవేరింది.
రెండేన్నరేళ్ల క్రితం శపథం చేసిన తరువాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. ప్రజా క్షేత్రంలోనే ఉంటూ వైసీపీపై బదులు తీర్చుకుని, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. 2024లో బంపర్ మెజార్టీతో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రిగా నేడు సభలో అడుగు పెట్టారు. అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు తొలుత ప్రవేశద్వారం మెట్ల వద్ద అసెంబ్లీ గడపకు నమస్కారం చేసి ప్రణమిల్లి లోపలికి వెళ్లారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా.. సగర్వంగా సభలో అడుగుపెట్టారు. అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు బావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ ముందు నమస్కరించి.. అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వేదపండితులు పూర్ణకుంభంతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అసెంబ్లీ ఆవరణలో పూజలు చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆప్యాయంగా కౌగిలించుకుని అసెంబ్లీ హాలులోకి వెళ్లారు.
అసెంబ్లీకి రావడాని కంటే ముందు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరిన చంద్రబాబు వెంకటపాలెం చేరుకున్నారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. వెంకటాయపాలెం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు.