Chandrababu Naidu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకి విజయవాడ ఏసీబీ కోర్టు షాకిచ్చింది. నవంబర్ ఒకటో తేదీ వరకూ చంద్రబాబు రిమాండుని ఎసిబి కోర్టు పొడిగించింది. నేటితో చంద్రబాబు రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఎసిబి కోర్టులో హాజరయ్యారు.
భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు..( Chandrababu Naidu)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సమావేశ మందిరం నుంచి వర్చువల్ గా చంద్రబాబును ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. రిమాండ్ పొడిగించే ముందు చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ న్యాయమూర్తి ఆరా తీశారు. జైలులో తనకు ఏర్పాటు చేసిన భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సకాలంలో నివేదికలు సమర్పించాలని జైలు అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని బదులిచ్చారు.అన్ని విషయాలని లిఖిత పూర్వకంగా సమర్పించాలని ఎసిబి కోర్టు ఆదేశించింది.