Triangle love Story: విశాఖలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన బాలిక ఇటీవల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు పలువురు యువకులతో పరిచయాలున్నాయి. ఆదర్శనగర్‌కు చెందిన సీపాన సూర్యప్రకాష్‌రావుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ.. ఇందిరానగర్‌కు చెందిన లెంకా సాయికుమార్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె సూర్యప్రకాష్‌తో చనువుగా ఉండడంతో సాయికుమార్‌కు నచ్చలేదు. అలాగే సాయికుమార్‌తో చనువుగా వ్యవహరించడం సూర్యప్రకాష్‌కు నచ్చలేదు. దీంతో వీరి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వచ్చారు.
ఒత్తిడికి లోనై ఆత్మహత్య..( Triangle love Story)
ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సూర్య ప్రకాష్, సాయికుమార్‌లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్యప్రకాష్ గోపాలపట్నం ఆర్‌ఆర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్‌గా గుర్తించారు. లంకా సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.