Site icon Prime9

Mp Avinash Reddy : ఓ వైపు తెలంగాణ హైకోర్టులో విచారణ.. మరోవైపు పులివెందుల పయనం.. మధ్యలో ఎంపీ అవినాష్ రెడ్డి

ysrcp mp-avinash-reddy going to pulivendula

ysrcp mp-avinash-reddy going to pulivendula

Mp Avinash Reddy : వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో  వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం తెలుపుతూ సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్,  జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.  అవినాష్ రెడ్డికి ముందస్తుగా లిఖిత పూర్వక ప్రశ్నావళిని అందించాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టు జారీ చేసిన ఆ ఉత్తర్వులపై సీజేఐ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని మీరు ఎందుకు ఊహిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే సీబీఐ అవినాష్ రెడ్డిని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేదని పేర్కొంది. విచారణ సమయంలో అవినాష్ రెడ్డికి లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం కూడ కరెక్టు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మరోవైపు.. జూన్‌ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును ఈ సందర్భంగా పొడిగించింది సీజేఐ ధర్మాసనం. కాగా ఈ క్రమం లోనే అనివాష్ రెడ్డి పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్‌పై త్వరగా విచారణ జరపాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరారు. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ ఇంకా అందలేదని లాయర్ కోర్టుకు తెలిపారు.సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ లేకుండా ఎలా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. అయితే మధ్యాహ్నం లోగా సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీని అందజేస్తామని  తెలిపారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే విచారణ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2.30 తర్వాత విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరారు. ఈయన మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు ఎంపీ అవినాష్.

Exit mobile version
Skip to toolbar