IND VS ENG: భారత్ , ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ కు 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ చేసినా మిగతా వారి నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో పరాజయం తప్ప లేదు.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బట్లర్ 9 బంతుల్లో 18 పరుగులు చేయగా మరో ఓపెనర్ జేసన్ రాయ్ 27 పరుగులు చేశాడు. హర్షల్ పటేల్ తన తొలి ఓవర్లో మలాన్‌ను అవుట్ చేసే అవకాశాన్ని జారవిడిచాడు. మలాన్ ఇచ్చిన రిటర్నర్ క్యాచ్ వదిలేయండంతో… ఆ తరువాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లవింగ్‌స్టోన్‌తో కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఐదో వికెట్‌కు 84 పరుగులు జోడించాక బిష్ణోయ్ బౌలింగ్‌లో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖర్లో లివింగ్‌స్టోన్, బ్రూక్ ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్ 216 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు అంతగా కలిసి రాలేదు. రోహిత్ 11, పంత్ ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. కోహ్లీ 11 పరుగులు మాత్రమే చేసి మరో మారు నిరాశ పరిచాడు. 31/3 స్కోరుతో టీమిండియా డీలాపడిన దశలో సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అండతో వీరోచిత పోరాటం చేశాడు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. విల్లే, జోర్డాన్, లివింగ్‌స్టోన్ ఎవరు బౌలింగ్‌కు దిగినా తన దూకుడు కొనసాగించాడు. 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న సూర్య మరో 50 పరుగుల్ని కేవలం 16 బంతుల్లోనే సాధించాడు. భారీ సిక్సర్లతో 55 బంతుల్లోనే 117 పరుగులు సాధించాడు. మరో ఎండ్ నుంచి వరుస పెట్టి వికెట్లు పడటంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. మూడో టీ20లో భారత్ ఓడినప్పటీకీ 2-0 తేడాతో సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టోప్లేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, భువనేశ్వర్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు.