New Delhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి మరికాసేపట్లో ఈడీ ముందుకు హాజరు కానున్నారు. గత నెలలో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వెళ్లలేక పోయారు. దాంతో ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని 5 రోజులు విచారించిన ఈడీ, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. మరోవైపు సోనియా ఈడీ ముందు హాజరు కావడానికంటే ముందే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ఎంపీలు హాజరు కావాలని పార్టీ ఆదేశించడంతో వారందరూ కార్యాలయానికి చేరుకుంటున్నారు.
బీజేపీ నియంతృత్వ పాలన విధానాలకు వ్యతిరేకంగా సోనియా ఈడీ కేసును వ్యతిరేకిస్తూ, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు సిద్ధమైంది. ఢిల్లిలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీస్ కు ప్రదర్శనగా వెళ్లనున్నారు. ఇక అధిష్టానం పిలుపుతో టీపీసీసీ సైతం నిరసనలకు సిద్దమైంది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గరి నుంచి ఈడీ కార్యాలయం వరకూ భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. అనంతరం ఈడీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలపనున్నారు.