Sabari Express: సికింద్రాబాద్ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్(17230)కు పెనుప్రమాదం తప్పింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్ మధ్య కంకరగుంట గేటు సమీపంలోని రైల్వేట్రాక్‌పై కొందరు దుండగులు అడ్డంగా ఇనుప రాడ్డును కట్టారు. ఇనుపరాడ్డును చూసి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ మంజునాథ్ రైలును ఆపేశాడు. దానితో పెను ప్రమాదం తప్పిందని లేదంటే ఆ రాడ్డు విరిగి లోకో అడుగు భాగాన తగిలి రైలులో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు.
రైలు పరిమిత వేగంతోనే వెళ్తున్నందున ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండానే రైలును నిలుపగలిగామని లోకోపైలెట్ వెల్లడించారు. ఇంజినీరింగ్ సిబ్బంది, సహాయ లోకోపైలెట్‌లు వెళ్లి ఆ రాడ్డును తొలగించారు. అనంతరం రైలును యథావిథిగా గుంటూరు స్టేషన్‌కు చేర్చారు. అయితే దుండగులు పథకం ప్రకారమే రైలు పట్టాలపై ఇనుపరాడ్డును ఉంచినట్లు రైల్వే సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాడ్డును గుడ్డతో కట్టడంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్టముక్కలు పెట్టారు. కాగా ఈ ఘటనపై సెక్షన్ 154,174సి కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మోర్బీ ఘటన.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న “గో బ్యాక్ మోదీ” ట్యాగ్