Site icon Prime9

Rains In Hyderabad : హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం.. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి మృతి

rains-in-hyderabad-and-child-death-news

rains-in-hyderabad-and-child-death-news

Rains In Hyderabad : హైదరాబాద్ తో పాటు తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో నగరం లోని పలు ప్రాంతాలు జలమయం అవ్వగా.. ట్రాఫిక్ నిలిచిపోయింది. అలానే విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్‌ నగర్, నారాయణగూడ, ఫిలిం నగర్, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, నాగారం, కీసర, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, చర్లపల్లి, నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్ సహా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మరికొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి నగరం లోని పలు ప్రాంతాల్లో దాదాపు 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. హిమాయత్‌నగర్‌, శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యాయని వివరించారు. అదే విధంగా తెలంగాణతో పాటు ఏపీలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ  శాఖ హెచ్చరించింది.

కాగా మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సికింద్రాబాద్‌ లోని కళాసిగూడలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే మౌనిక ఉదయం తన సోదరుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకురావడానికి బయటికి వచ్చింది. ఇద్దరు వర్షంలో తడుస్తూనే పాలకోసం ఇంటి నుంచి బయలుదేరారు. అయితే కళాసిగూడలో మొత్తం నీరు చేరడంతో చిన్నారులు ఇద్దరు నడుచుకుంటూనే ముందుకు సాగారు. అయితే జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్‌ను తెరిచి ఉంచడంతో మౌనిక తమ్ముడు నీటిలో పడిపోయాడు. చిన్నారి మౌనిక తన తమ్ముడిని కాపాడే క్రమంలో డ్రైనేజీలో పడిపోయింది. అయితే అది గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదు.

జీహెచ్ఎంసీ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మ్యాన్‌ హోల్‌ ను మూసివేశారు. అయితే చిన్నారి కోసం డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టగా పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం మౌనిక స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతుందని తెలిసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. జీహెచ్‌ ఎంసీ నిర్లక్ష్యం వల్లే తన చిన్నారి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్‌ హోల్‌ మూసి వుంటే చిన్నారి మౌనిక బతికి ఉండేదని వాపోయారు. జీహెచ్‌ఎంసీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

 

Exit mobile version