Hyderabad: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ విధించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు డీఆర్‌ఎఫ్ సిబ్బంది భారీ వర్షాల్లో చేపట్టాల్సిన చర్యల నిమిత్తం సంసిద్ధమయ్యారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది.ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్ అసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణ్‌పేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రుతుపవనాలు వేగంగా కదులుతూ అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి వివరించారు. గడిచిన 24 గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కంటే 45 శాతం అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ భారీ వర్షం కొనసాగింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 19.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు జిల్లాల్లో వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. నల్గొండలో గోడ కూలి తల్లీకుమార్తె చనిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్‌యూబీ కింద వర్షపు నీటిలో పాఠశాల బస్సు చిక్కుకుంది. సమీపంలోని రైతులు, యువకులు 25 మంది విద్యార్థులను రక్షించారు. గజ్వేల్ మండలంలో పాఠశాల ఆవరణలో విద్యుత్ స్తంభం కూలింది. విద్యార్థులెవ్వరికీ ఏమీ కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండు శుక్రవారం ఉదయం 8 గంటలకు 8 వేల 356 మెగావాట్లుంటే రాత్రి 8.30 గంటలకు 6 వేల మెగావాట్లకు పడిపోయింది. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 20.6 అడుగులకు పెరిగింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతవాగు పొంగి సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం, స్వామివారి ఉత్తరీయం తెలిపే ఆనవాళ్లు నీట మునిగాయి.