Site icon Prime9

Pawan Kalyan: సారీ నేను రాలేను.. రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం పై జనసేనాని లేఖ

Andhra Pradesh: భార‌త రాష్ట్రప‌తిగా కొన‌సాగుతున్న రామ్ నాథ్ కోవింద్ ప‌దవీ కాలం ఈ నెల 24తో ముగియ‌నుంది. నూత‌న రాష్ట్రప‌తిగా ఎన్నికైన ద్రౌప‌ది ముర్ము రాష్ట్రప‌తిగా ఈ నెల 25న ప్రమాణం చేయ‌నున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రామ్ నాథ్ కోవింద్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌క‌నుంది.

రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా ఆహ్వానం అందింది. బీజేపీకి జ‌న‌సేన ప‌క్షంగా కొన‌సాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత‌గా ప‌వ‌న్‌కు బీజేపీ ఆహ్వానం ప‌లికింది. రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు స‌భ‌కు త‌న‌ను బీజేపీ ఆహ్వానించింద‌ని ప‌వ‌న్ గురువారం రాత్రి ప్రక‌టించారు. అయితే అనారోగ్య కార‌ణాల వ‌ల్ల తాను ఈ కార్యక్రమానికి హాజ‌రు కావ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. తనను ఆహ్వానించిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపిన జనసేనాని, తప్పనిసరిగా హాజరు కావాల్సిన చారిత్రాత్మక కార్యక్రమానికి ఆరోగ్య కారణాల రీత్యా వెళ్లలేకపోతున్నందుకు చింతిస్తున్నానన్నారు.

నిష్కంళకుడైన రామ్‌నాథ్ కోవింద్ తన ఐదేళ్ల పాలన కాలంలో ఎలాంటి పొరపొచ్చాలకు తావులేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆయనలోని రాజనీతజ్ఞతకు నిదర్శనమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు జనసేనాని అభినందనలు తెలిపారు. ఇటీవల కోనసీమ జిల్లా మండపేటలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన జనసేనాని, ఆ తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఆదివారం జరగాల్సిన జనసేన జనవాణి కార్యక్రమాన్ని సైతం రద్దు చేశారు.

Exit mobile version