Varahi : జనసేన వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు… జగన్ సర్కారు జీవోని కాదని పవన్ కళ్యాణ్ బరిలోకి దిగనున్నారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ ప్రజలతో క్షేత్ర స్థాయిలో

  • Written By:
  • Updated On - January 16, 2023 / 04:22 PM IST

Varahi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ ప్రజలతో క్షేత్ర స్థాయిలో మమేకం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు బస్సు యాత్ర చేయనున్న పవన్ … తన వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వారాహి రంగు గురించి జనసేన – వైకాపా నాయకుల మధ్య మాటల యుద్దమే జరిగింది. ఈ తరుణంలో మనల్ని ఎవడ్రా ఆపేదంటూ… వారాహిని ఆపితే అప్పుడు చూపిస్తానంటూ పవన్ చెలరేగారు. ముఖ్యంగా ఇప్పటం ఘటన నుంచి పవన్ కళ్యాణ్ వెర్షన్ మార్చారని తెలుస్తుంది.

వైకాపా నాయకులే టార్గెట్ గా పవన్ మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా తనను విమర్శించే వైకాపా కాపు నాయకులకు జనసేనాని ఓ రేంజ్ లో ఇచ్చిపడేశారు. సత్తెనపల్లిలో జరిగిన కౌలు రైతు భరోసా యాత్రలో అంబటి రాంబాబుపై పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారగా… ప్రతిపక్షాలు, మీడియా అంబటిని ఏకీపారేశాయి. ఇక తన మూడు పెళ్ళిళ్ళ గురించి, వీకెండ్ పొలిటీషియన్ అంటూ కామెంట్లు చేసే వారికి కూడా పవన్ మాటల తోనే గట్టిగా సమాధానం ఇచ్చారు. ఈ దెబ్బతో వైకాపా నేతలు కూడా ఒకింత సైలెంట్ అయిపోయారు.

కాగా ఇప్పుడు మరోసారి పవన్ జోరు పెంచినట్లు తెలుస్తుంది. ఈనెల 12 వ తేదీన జనసేన యువశక్తి పేరిట శ్రీకాకుళం జిల్లాలో సభ నిర్వహించనుంది. పవన్ కళ్యాణ్ కి, జనసేనకి ప్రధాన బలమైన యువతకి ఈ సభ ద్వారా తన భవిష్యత్తు కార్యాచరణ గురించి పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. యువత బలాన్ని ప్రధానంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాత నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని సమాచారం అందుతుంది.

ఈ మేరకు సంక్రాంతి తర్వాత వారాహికి జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని… శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో తొలి పూజ చేయాలని పవన్ ఫిక్సయ్యారట. స్వతహాగా కళ్యాణ్ బాబుకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం అని అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా మొదటి నుంచి హనుమంతుడంటే అమితమైన భక్తి అని పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. దీంతో కొండగట్టు ఆంజనేయ స్వామికి తొలి పూజలను చేసిన తర్వాత బస్సు యాత్రకు పవన్ కళ్యాణ్ సమర శంఖం పూరించనున్నారు.

మరోవైపు ఏపీలో రోడ్ షో లను నిషేదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనసేన నేత నాగబాబు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. జగన్ సర్కారు భయంతోనే పవన్ యాత్రను అడ్డుకోవడానికి ఈ జీవో జారీ చేసిందని జనసేన నేతలంతా ఆరోపిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పవన్ చేయబోయే ఈ యాత్ర గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ సర్కారు జీవోకి పవన్ ఎలా బదులిస్తారు? ఏ విధంగా బస్సు యాత్రని కొనసాగిస్తార జనసైనికులంతా ఎదురు చూస్తున్నారు.