Munugode: తెలంగాణాలో ప్రధాన పార్టీలు 2023 అసెంబ్లీ ఎన్నికల విజయం సాధించేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకొంటున్నారు. దీంతో నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కొత్త పంధాను ఎంచుకొన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ఉప ఎన్నికలో ఓటు హక్కును కోరకుంటూ కొత్తగా 23వేల మంది దరఖాస్తులు చేసుకొన్నారు. దీంతో ఖంగుతినడం ఎన్నికల కమీషన్ వంతైంది.
ఒకటిన్నర సంవత్సర క్రితం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికల సమయంలో ఓటు హక్కు కోసం 1500 దరఖాస్తులు ఈసీకి రాగ, మునుగోడులో అందుకు రెట్టింపుగా 15రెట్లు ఓటు హక్కును కోరుకుంటూ ప్రజలు దరఖాస్తులు చేసుకొన్నారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్పు చేస్తూ సీఎం కేసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ పార్టీ శ్రేణులు బహిరంగానే మద్యం, కోళ్లు పంచి పెట్టారు. అంతుకు ముందు నుంచే మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక్క ఓటుకు 20వేల నుండి 30 వేల వరకు రాజకీయ పార్టీలు ఇస్తాయని ఓ టాక్ పబ్లిక్ లో వైరల్ అయింది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉండే మునుగోడు ప్రజలు తమ ఓటును మునుగోడుకు మార్చాలంటూ అర్జీలు పెట్టుకొన్నారు. వీరితో పాటు కొత్తగా 18 సంవత్సరాల యువత కూడా ఓటు హక్కు కోసం నమోదు చేసుకొన్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో నియోజక వర్గాల్లో ఓటు హక్కును కోరుకొనే వారి శాతం 2 నుండి 4 శాతం లోపుగా ఉంటుంది. కాని తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు పార్టీలకు కీలకంగా మారిన నేపధ్యంలో, 12శాతం కొత్త ఓటర్లు అర్జీలు పెట్టుకోవడంతో అధికారులు ఒకింత ఆశ్చర్యానికి గురౌతున్నారు.
ఇప్పటికే అధికార పార్టీ మునుగోడు ఎన్నికల్లో అక్రమాలకు, ప్రలోభాలకు పాల్పొడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రధాన పార్టీలు భాజపా, కాంగ్రెస్ లు ఆరోపణలు, ఫిర్యాదులు కూడా చేసివున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపా, టీఆర్ఎస్ నేతలు కొత్త ఓట్ల నమోదుకు ప్లాన్ చేశారని ఒకరిపై ఒకరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకొన్నారు. అర్జీ పెట్టుకొన్న 23వేల ఓట్లు ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఎన్నికల కమీషన్ అప్రమత్త మైంది.
కొత్త ఓట్ల దరఖాస్తులను బీఎల్‌వో ద్వారా విచారణ అనంతరం నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. మునుగోడులో ఆ అధికారాన్ని సూపర్‌వైజర్లు, తహసీల్దార్లకు అప్పగించారు. కొత్త ఓటు కోసం వచ్చిన ప్రతి దరఖాస్తునూ క్షుణ్నంగా పరిశీలించాలని, ఒక్కో దరఖాస్తుకూ ఒక్కో ఫైలు ఏర్పాటు చేయాలని, అవసరమైన సర్టిఫికెట్లు జత చేశారా, లేదా అనే విషయాన్ని స్పష్టంగా వ్రాయాలంటూ నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఓటు పొందేందుకు, తిరస్కరణలకు గల కారణాలను కూడా ఆ ఫైల్‌లో వివరంగా రాయాలని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈనెల 14న చివరి తేదీగా ఈసీ పేర్కొనింది. అప్పటి వరకు కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 14న మునుగోడు ఉప ఎన్నిక ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.
మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఎవరి ఎత్తుల్లో వారు ఉన్నారు. అధికార పార్టీ ఎంత ఖర్చు అయినా మునుగోడు సీటు కైవశం చేసుకొనేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తుంది. మరో వైపు భాజపా, కాంగ్రెస్ లు అధికార బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు తమ వంతు ప్రచారాలను కూడా ముమ్మరం చేశారు. ఏది ఏమైనా ఓటరు ప్రధాన పార్టీల భవిష్యత్ ను నిర్ణయించనున్నారు. ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాదనం కానుంది.
ఇది కూడా చదవండి: BRS: నేడు ఈసీతో భేటీకానున్న బీఆర్ఎస్ నేతలు