Basara: విద్యాబుద్ధులు నేర్పే తల్లి జ్ఞాన సరస్వతి దేవి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు అర్చకస్వాములు. చిన్నారులకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని ప్రజల నమ్మకం. అలాంటి రోజైన ఈ రోజున తెలుగురాష్ట్రాల్లోని ప్రసిద్ధ సరస్వతి దేవి క్షేత్రమైన బాసరలోని సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
బాసర సరస్వతీ దేవి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నేడు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతి మాత సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమవడంతో మండపాల్లో రద్దీ ఏర్పడింది. అయితే మూలానక్షత్రం సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఇదీ చదవండి: ఆ ఆలయమంతా డబ్బు, బంగారమే..!