Raghu Rama Krishna Raju: మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. పవన్ కళ్యాణ్ కు ఎంపీ రఘురామరాజు ప్రశంసలు

భీమవరంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న జససేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సొంత పార్టీలో సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులతో లాక్కొచ్చి

  • Written By:
  • Publish Date - July 18, 2022 / 11:14 AM IST

Andhra Pradesh: భీమవరంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న జససేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సొంత పార్టీలో సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులతో లాక్కొచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని పవన్ ఆరోపించారు. అరికాళ్లపై కొట్టించి, నడవలేకుండా చేశారని వివరించారు. మొన్నటికిమొన్న ఆయన తన సొంత నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితులు తీసుకువచ్చారని వెల్లడించారు. ఇది రఘురామకృష్ణరాజు మీద చేసిన దాడిలా చూడడంలేదని, క్షత్రియులందరిపై వైసీపీ చేసిన దాడిగా చూస్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

అదే మీ పులివెందులలో ఈ విధంగా చేస్తే మీరు ఒప్పుకుంటారా? అని పవన్ ప్రశ్నించారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనం కులాలుగా విడిపోయామని, రఘురామకృష్ణరాజు తన కులం కాదు కానీ, సాటి మనిషి అన్నారు. ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి ఆయన అని, ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే అందుకు బదులివ్వడం అనేది ఉంటుందని, కానీ అందుకు కూడా ఓ పరిమితి ఉంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు వెంటనే స్పందించారు. పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఐడీ పోలీసులు నాపై చేసిన క్రూరమైన దాడిని మీరు ఖండించినందుకు ధన్యవాదాలు అంటూ పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు పవన్ కి ఆహ్వానం ఉన్నప్పటికీ, తన సొంత నియోజకవర్గానికి, విగ్రహావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం రానివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా, అంత గొప్ప కార్యక్రమానికి మీరు హాజరుకాకపోవడం మీలాంటి ధైర్యమున్న నాయకులకు మాత్రమే సాధ్యమని రఘురామకృష్ణరాజు కొనియాడారు. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కితాబు ఇచ్చారు.