MLC Elections: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి , మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది.

MLC Elections: ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి , మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.

ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగినట్లు అధికారులు వెల్లడించారు.

మధ్యాహ్నం 2 గంటల వరకు 75శాతం ఓటింగ్‌ నమోదైనట్లు వెల్లడించిన అధికారులు సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 90 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

75 శాతం పోలింగ్‌ నమోదు( MLC Elections)

మధ్యాహ్నం 2 గంటల వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో 64 శాతం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 81 శాతం, వనపర్తిలో 74 శాతం, గద్వాల్‌లో 88 శాతం, నారాయణ్‌పేట్‌లో 81 శాతం, రంగారెడ్డిలో 65 శాతం, వికారాబాద్‌ జిల్లాలో 79, మేడ్చల్‌ మల్కాజిగిరి 68, హైదరాబాద్‌లో 68 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

సాయంత్రం 5 గంటల వరకు సరాసరి 75 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులకు సరూర్‌నగర్‌లోని ఇండోర్‌స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచనున్నారు.

ఈ నెల 16 న ఉదయం 8 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.