Site icon Prime9

Minister KTR: ’ఇది గోల్ మాల్ గుజరాత్ కాదు.. గోల్డెన్ తెలంగాణ‘

Minister KTR

Minister KTR

Minister KTR: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. గొల్డెన్ తెలంగాణ నమూనాను దేశానికి పరిచయం చేయడం కోసం బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని ఆయన చెప్పారు. అంతేతప్ప ఇది గోల్‌మాల్‌ గుజరాత్‌ కాదని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మారిందే తప్ప డీఎన్‌ఏ, జెండా, అజెండా ఏం మారలేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తున్నాయని కేటీఆర్‌ విమర్శించారు.

 

ప్రజల విశ్వాసంతోనే(Minister KTR)

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పటి భారత రాష్ర్ట సమితి ఆవిర్భవించి ఏప్రిల్ 27కు 22 ఏళ్లు పూర్తవుతుందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్‌కు పేరు, ప్రతిష్ఠ, డబ్బు, మీడియా బలం లేదని.. కేవలం ప్రజలకు ఉన్న విశ్వాసమే పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు. ఉద్యమం నుంచి తప్పుకొంటే రాళ్లతో కొట్టండి అని కేసీఆర్‌ ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్తున్నా.. తెలంగాణతో తిరిగి వస్తానని ధైర్యంతో చెప్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వారికే అధికారం కట్టబెడితే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు ఓట్లేశారన్నారు.

 

దేశం మొత్తం తెలంగాణ మోడల్

ఇప్పుడు సిరిసిల్ల ఎక్కడి నుంచి ఏ స్థాయికి అభివృద్ధి చెందిందో మీరే ఆలోచించండని ప్రజలను కోరారు. ఒకనాడు డిగ్రీ కళాశాలకు కూడా నోచుకోని సిరిసిల్లలో ఇవాళ మెడికల్ కాలేజీ ,ఇంజనీరింగ్ ,ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో అర్థం చేసుకోవాలని తెలిపారు. పక్క నియోజకవర్గాలు, ప్రతిపక్షాలు అసూయ పడే విధంగా సిరిసిల్లను అభివృద్ధి చేసుకుంటున్నామని.. ఇప్పుడు అభివృద్ధి చెందిన తెలంగాణ మోడల్‌ను దేశం మొత్తం అమలు చేయడమే బీఆర్ ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ చేసిన గోల్‌మాల్‌ను దేశమంతటికీ వివరించాలన్నారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని మహారాష్ట్ర రైతులు గర్జిస్తున్నారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే రోజు త్వరలోనే వస్తుందని కేటీఆర్‌ అన్నారు.

 

Exit mobile version