Site icon Prime9

MI VS LSG : కీలక పోరులో చేతులెత్తేసిన ముంబై.. విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్

MI VS LSG match highlights in ipl 2023

MI VS LSG match highlights in ipl 2023

MI VS LSG : ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన 63వ లీగ్ మ్యాచ్ లో  లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. లీగ్ మ్యాచ్ ల నుంచి ప్లే ఆఫ్స్ కి చేరువవుతున్న తరుణంలో కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది. దాంతో 5 పరుగుల తేడాతో లక్నో సూపర్ విక్టరీ కొట్టింది.

లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (59: 39 బంతుల్లో 8×4, 1×6), రోహిత్ శర్మ (37: 25 బంతుల్లో 1×4, 3×6) మెరుగైన ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కి 9.4 ఓవర్లలోనే ఈ జోడి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ అవ్వగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (7), నేహాల్ వధీర (16), విష్ణు వినోద్ (2) ఫెయిలయ్యారు. కానీ టిమ్ డేవిడ్ (32 నాటౌట్: 19 బంతుల్లో 1×4, 3×6) ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించాడు. చివరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన క్రమంలో క్రీజులో టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ ఉండటంతో ముంబై  గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ లాస్ట్ ఓవర్ వేసిన మోసిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం 5 పరుగులే ఇచ్చాడు. దాంతో లక్నో విజయం సాధించింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మోసిన్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్కో జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లక్నో జట్టులో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ చెలరేగిపోయాడు. పవర్ హిట్టింగ్ తో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సులతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టొయినిస్ విజృంభణతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. అలానే కృనాల్ పాండ్యా 42 బంతుల్లో 49 పరుగులు చేసి రిటైర్ట్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆఖర్లో స్టొయినిస్ రెచ్చిపోయాడు. స్టొయినిస్ ధాటికి చివరి 5 ఓవర్లలో లక్నో జట్టుకు 69 పరుగులు లభించాయి. ముంబై బౌలర్లలో జాసన్ బెహరెన్ డార్ఫ్ 2 వికెట్లు తీశాడు. పియూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ విజయంతో  పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్  మూడో   స్థానానికి ఎగబాకింది. లక్నోకు 13 మ్యాచ్ లలో ఇది  7 వ విజయం. దీంతో ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. ఓటమితో ముంబై   నాలుగో స్థానానికి పరిమితమై  ప్లేఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ముంబై తర్వాత మ్యాచ్ లో గెలవడంతో పాటు నాలుగో స్థానం  కోసం పోటీ పడుతున్న  ఆర్సీబీ, పంజాబ్ జట్ల ఫలితాలపై ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. చూడాలి మరి ఏ ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చెరతాయో అని.

Exit mobile version