Weather Updates : తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు రానున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గుంటురు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. రాజమండ్రిలోనూ భారీ వర్షం దంచికొట్టింది. రోడ్లు జలమయం అయ్యాయి. మొత్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు.. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు.
అదే విధంగా మిగతా జిల్లాలోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయని అంటున్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇక.. వారం రోజులపాటు ఏపీలో వాతావరణం చల్లబడుతుందని చెప్పింది.
తెలంగాణలోనూ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని ఆవర్తన ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో తెలంగాణలోని 16 జిల్లాలకు అధికారులు రెండు రోజుల పాటు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మరోవైపు.. హైదరాబాద్ నగరంలోనూ రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.