Site icon Prime9

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Hyderabad: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవితవ్యం పై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.

తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కేవలం కేసీఆర్ కోసమే తెలంగాణ తెచ్చినట్టు అనిపిస్తోందన్నారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన ఫలితాలు కొద్దిమంది మాత్రమే అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ తీరుపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లు కష్టపడిన వారిని కాదని, కాంగ్రెస్ పార్టీని తిట్టిన వాళ్లకు పదవులకు ఇచ్చారన్నారు. వాళ్ల కింద పనిచేయాలని తమకు చెప్పడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ కోసం తాము కష్టపడి, బయట నుంచి వచ్చిన వ్యక్తులను ముఖ్యమంత్రులను చేయాలా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో తమకే ఆత్మ గౌరవం లేదని, ఇక తమను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడటం బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీలో చేరికపై త్వరలోనే చెప్తానన్నారు.

Exit mobile version