Kanna Lakshminarayana: మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు.
అదే విధంగా గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు, తాళ్ల వెంకటేశ్ యాదవ్ మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్ నిజాముద్దీన్ తదితరులు టీడీపీలో చేరారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అనుచరులతో భారీ ర్యాలీగా((Kanna Lakshminarayana)
అంతకుముందు కన్నా లక్ష్మినారాయణ గుంటూరులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వచ్చారు.
దాదాపు 3 వేల మంది కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
కాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా… ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై వారిని తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
నిత్యం జనం మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కన్నాకు ఏ పార్టీలో ఉన్నా జనాదరణ మెండుగా ఉంటుందని..
ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాపు సామాజికవర్గంలో ఆయనకు ఎంతో పట్టుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
అందుకే కన్నా చేరికను టీడీపీ శ్రేణులు స్వాగతించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.
బీజేపీలో ఇమడలేక..
కాగా, ఈ నెల 16 కన్నా లక్ష్మీనారాయణ భాజపాకు రాజీనామా చేశారు. కొంత కాలంగా కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో మధ్య విబేధాలు
కొనసాగుతున్నాయి. సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
ఈ తరుణంలోనే పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు భావించారు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి ఆకర్షితుడిని అయ్యానని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
తన పనిని గుర్తించి 2018లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇచ్చారని.. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని,
మోదీ నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశానని తెలిపారు.
సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నామన్నారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడామని అన్నారు. మోదీ అంటే జీవితకాల అభిమానం ఉన్నప్పటికీ పార్టీలో ఇమడలేకపోయానని వెల్లడించారు.
నిబద్ధతతో పని చేసే వ్యక్తి: చంద్రబాబు
కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయనను మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకత ఉన్న వ్యక్తిగా కన్నాకు పేరుందని .. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదిగారన్నారు.
వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కన్నా.. 2004 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేశారన్నారు.
పదవులు శాశ్వతం కాదని.. నిబద్ధతతో ఆయన పనిచేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. వైఎస్సార్సీపీ ని గద్దె దించేందుకు అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.