Site icon Prime9

South Korea: సియోల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

Heavy-rains-Seoul

Heavy-rains-Seoul

South Korea: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. భారీ వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లపై కార్లు నీటమునిగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కొన్ని వీధుల్లో భారీగా వరద నీరు చేరుతుండటంతో సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడించారు. ఓ ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న ఇంట్లో ఉన్న ముగ్గురిని రక్షించడం సిబ్బందికి వీలుకాలేదని వారు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అధ్యక్షుడు యూన్‌ ఇవాళ సందర్శించారు. సియోల్‌ సమీపంలోని ఇంచియాన్‌, గ్యాంగీల్లో గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. సియోల్‌లోని డాంగ్జాక్‌ జిల్లాలో గంటకు 141.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని, 1942 నుంచి చూస్తే ఇదే అత్యధికం వర్షపాతమని అధికారులు తెలిపారు.

సియోల్‌లో భారీ వర్షపాతానికి రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. నగరంలో రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌-యేల్‌ అధికారులను ఆదేశించారు.

Exit mobile version