Munugode Bypolls: మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కొమటిరెడ్డి బద్రర్స్ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎలాగైన మునుగోడును గెలుచుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కితో పాటు ఏఐసీసీ కార్యదర్శలు జూమ్ మీటింగ్‌లో మాట్లాడుకున్నారు. అభ్యర్థి ఎంపిక, పార్టీ క్యాడర్ చేజారకుండా ఏం చేయాలనేదాని పై జూమ్ మీటింగ్ లో చర్చించారు. మరోవైపు పోటీలో ఎవరిని దింపితే బాగుంటుందనే అంశంపై ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్ పెద్దలు సర్వే నిర్వహిస్తున్నారు. ఇక సర్వే రిపోర్ట్స్ వచ్చాకే అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ కు రానున్నారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో సాయంత్రం సమావేశం కానున్నారు. గాంధీభవన్‌కు రావాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి, చెరుకు సుధాకర్, పాల్వాయి స్రవంతితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మునుగోడులో పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు రానుంది అధిష్టానం.