CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్ క్రీడలను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే. టీమ్ విభాగంలో రజతంతో సరిపెట్టుకున్నపుడు, సింగిల్స్‌లో స్వర్ణం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసిన అగ్రశ్రేణి షట్లర్ పి.వి.సింధు. ఆ మాటను నిలబెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు. కెనడాకు చెందిన 13వ ర్యాంకు క్రీడాకారిణి మిచెలీ లిను అలవోకగా ఓడించింది. ఇప్పటికే రెండుసార్లు తన చేతిలో ఓటమి పాలైన మిచెలీకి ఈ మ్యాచ్‌లోనూ సింధు అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్ నుంచే భారత స్టార్ దూకుడుగా ఆడగా, మిచెలీ నెట్ దగ్గర పాయింట్లు సాధించేందుకు ప్రయత్నించింది. 7-6తో ఆధిక్యంలో ఉన్న దశలో జోరు పెంచిన సింధు 14-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ దశలో మిచెలీ కొంచెం పుంజుకున్నా సింధు పట్టు వదల్లేదు. రెండో గేమ్‌లో విరామ సమయానికి 11-6తో ఆధిక్యంలోకి వెళ్లిన తెలుగమ్మాయి, అదే ఊపులో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
మరోవైపు కామన్వెల్త్ క్రీడల్లో పోటీ పడ్డ తొలిసారే లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు. ప్రపంచ పదో రాం్యకర్ లక్ష్య ఫైనల్లో 42వ ర్యాంకు క్రీడాకారుడు జి యాంగ్‌పై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ను త్రుటిలో కోల్పోయిన భారత షట్లర్.. రెండో గేమ్‌లో 11-9తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా 12 పాయింట్లు కొల్లగొట్టి స్కోరు సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా లక్ష్య పట్టు వదల్లేదు. పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ స్వర్ణం సాధించాడు. ఈ జోడీ 21-15, 21-13తో బెన్ లేన్-సీన్ మెండీ జంటను సునాయాసంగా ఓడించింది. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మొత్తంగా ఆరు పతకాలు దక్కాయి. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత బృందం రజతం గెలవగా, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీకి కాంస్యాలు దక్కాయి. కాంస్య పతక మ్యాచ్‌ల్లో శ్రీకాంత్, జియా హెంగ్ పై, గాయత్రి-ట్రీసా, సుయాన్-గ్రోన్యాలపై నెగ్గారు.
22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు, మొత్తంగా ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో 61 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది భారత్. 2010లో సొంతగడ్డపై జరిగిన క్రీడల్లో 38 స్వర్ణాలు సహా 101 పతకాలతో పట్టికలో మన దేశానికి రెండో స్థానం దక్కింది. 2002లో 30 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించడం తర్వాతి ఉత్తమ ప్రదర్శన. అయితే కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఎప్పుడూ పతకాల పంట పండించే షూటింగ్‌ను ఈసారి పక్కన పెట్టారు. ప్రస్తుత ఈవెంట్‌ను పక్కన పెట్టి, 2018 వరకు భారత్ కామన్వెల్త్ క్రీడల్లో 203 స్వర్ణాలు సాధిస్తే, అందులో షూటింగ్ వాటా 63. దీన్ని బట్టే మన షూటర్ల ఆధిపత్యాన్ని అంచనా వేయొచ్చు. ఈసారి వాళ్లు బరిలో లేకుండానే భారత్ 22 స్వర్ణాలు సాధించడమంటే గొప్ప ప్రదర్శన చేసినట్లే. షూటింగ్ కూడా ఉండుంటే 2010 క్రీడల తర్వాత ఉత్తమ ప్రదర్శన ఇప్పటిదే అయ్యేది. ఇక ఎప్పట్లాగే ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత క్రీడల్లో 67 స్వర్ణాలు సహా 178 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ 57 స్వర్ణాలు సహా 176 పతకాలు), కెనడా 26 స్వర్ణాలు సహా 92 పతకాలు తర్వాతి రెండు స్థానాలు సాధించాయి. ముగింపు వేడుకల్లో శరత్ కమల్, నిఖత్ జరీన్ పతాకధారులుగా వ్యవహరించారు.
కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలిచిన భారత క్రీడాకారులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. సింధు మేటి క్రీడాకారిణి. విజేతలకు విజేత. ఆమె అంకితభావం స్ఫూర్తిదాయకం. సీడబ్ల్యూజీలో స్వర్ణం గెలిచిన ఆమెకు అభినందనలు అని ప్రధాని అన్నారు. శరత్ కమల్ ఎంతో సహనాన్ని, పట్టుదలను ప్రదర్శించాడని, అతడి విజయం భారత టీటీకి ఊతమిస్తుందని మోదీ చెప్పారు. లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ తదితర పతక విజేతలను మోదీ అభినందించారు.