BJP Chief Bandi Sanjay Press Meet: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ పై దృష్టిని మళ్లించి కూతురును కాపాడుకోవడానికే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నాడు. దమ్ముంటే నీ కూతురుని పార్టీ నుంచి సస్పెండ్ చేయి. నీ కూతురికి ఒక రూల్. ఇతరులకు ఒక రూలా అంటూ సంజయ్ ప్రశ్నించారు.
బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటివద్ద ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతుంటే వారిని అన్యాయంగా అరెస్ట్ చేసారని సంజయ్ ఆరోపించారు. ఈ సందర్బంగా ఒక పోలీస్ అధికారి అసభ్యకరంగా మాట్లాడినట్లు మహిళా మోర్చా కార్యకర్తలు ఏడుస్తూ తనకు ఫోన్ చేసారని సంజయ్ తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కండువాలు ధరించి తమపై దాడికి పాల్పడుతున్నారని అన్నారు. యువత తరలివరావాలని అరెస్టులకు భయపడవద్దని కోరారు. సీఎం కేసీఆర్ కు ఉదయం లేచినప్పటినుంచి ఈడీ అంటే భయం. అందుకే పదిపెగ్గులు తాగి ఐదు రగ్గులు కప్పుకుని పడుకుంటాడని సంజయ్ ఎద్దేవా చేసారు. 21 రోజులుగా యాత్రపై లేని సమస్య ఇవాళ ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. ఈరోజే తన యాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంటని నిలదీశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆమె ఇంటి వద్ద సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనితో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు.