Site icon Prime9

Bihar Political Crisis: బీహార్ లో జేడీయూ – ఆర్జేడీ సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్దం.. గవర్నర్ ను కలుస్తున్న నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్

Bihar: బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమయం కోరినట్లు సమాచారం. ఈ సమావేశం మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల మధ్య జరగొచ్చు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కలిసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు రాజీనామా చేయవచ్చని సమాచారం. ఈ16 మంది మంత్రులు మంగళవారం సమావేశమవుతున్నారు. అనంతరం వారు రాజ్‌భవన్‌కు వెళ్లి మంగళవారం రాజీనామాలు సమర్పించే అవకాశముంది.

బీహార్‌లో జనతాదళ్ యునైటెడ్, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు తెగే దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసంలో జరిగిన సమావేశంలో నితీష్ కుమార్ పేరును సీఎంగా ఆమోదించారని భోగట్టా. ఆయన పేరు పై మహాకూటమి నేతలు ఏకీభవిస్తున్నట్లు సమాచారం. నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో డీల్ ఖరారు చేయడంతో పాటు సంకీర్ణ ప్రభుత్వ ఫార్ములా ఖరారైంది. తేజస్వి యాదవ్ హోం మంత్రిత్వ శాఖను కోరినట్లు సమాచారం. బీహార్‌లో కొత్త ప్రభుత్వానికి సన్నాహాలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ముగ్గురు మంత్రులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

1990ల నుంచి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ, బీజేపీలు ఇటీవలి కాలంలో అగ్నిపథ్ పథకం, కుల గణన, జనాభా చట్టం, లౌడ్ స్పీకర్లపై నిషేధం వంటి అంశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జేడీయూ ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇచ్చినా, వీటికి సంబంధించిన పలు కార్యక్రమాలకు నితీశ్ కుమార్ గైర్హాజరయ్యారు. ఆదివారం నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం హాజరుకాలేదు.

Exit mobile version