Big Relief to RGV: ఆంధ్రప్రదేశ్‌లో తనపై వరుసగా నమోదు అవుతున్న కేసులపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కోర్టు పటిషన్ దాకలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు గతవారం వరకు ఆయనకు ఊరట ఇచ్చింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం వర్మకు వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేసింది.
తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు గతవారం వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఈ శుక్రవారం వరకు పొడగించింది. రామ్ గోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలోని ఇచ్చిన ఉత్తర్వులనే మరోసారి వెలువరించింది. ఇక ఆయన ముందస్తు బెయిల్ పటిషన్‌పై రేపు కోర్టులో విచారణ జరగనుంది. కాగా వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమా టైంలో వర్మ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు వారిని కించపరిచేలా ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు షేర్ చేశాడు. దీనిపై ఏపీలో పలు చోట్ల ఆయనపై టీడీపీ, జనసేన శ్రేణులు కేసు నమోదు చేస్తున్నారు. దాదాపు 9 జిల్లాల్లో వర్మపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆర్జీవీ తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి కోర్టు నిరాకరించడంతో ముందస్తు బెయిల్ కోసం మరో పటిషన్ వేశారు. అంతేకాదు తనపై కావాలనే కేసులు పెడుతున్నారంటూ ఆధారాలతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు ఊరట నిస్తూ చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది.