Site icon Prime9

Anam Ramnarayana Reddy : సాధారణ జర్నలిస్టు‌ అయిన సజ్జల ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తారు – ఆనం రాంనారాయణ రెడ్డి

anam ramnarayana reddy shocking comments on sajjala ramakrishna reddy

anam ramnarayana reddy shocking comments on sajjala ramakrishna reddy

Anam Ramnarayana Reddy : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు .. మరోవైపు సస్పెండ్ చేయబడ్డ రెబల్ ఎమ్మెల్యేలతో మాటల యుద్ధం నడుస్తుంది. ఈ మేరకు తాజాగా వైసీపీ అధినాయకత్వంపై ఎమ్యెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను క్రాస్‌ ఓటింగ్‌ చేశాననేది నామీద బురద జల్లడమే అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో నెల్లూరులో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్యెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి ఇంకా ఏమన్నారంటే (Anam Ramnarayana Reddy)..

సాధారణ జర్నలిస్టు‌ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల ముందు రోజు సజ్జల ప్రకటనకి, తర్వాత రోజు మాట్లాడిన దానికి సంబంధం ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఓటింగ్‌లో సీక్రెట్‌ బ్యాలెట్‌ పెడితే.. ఎవరు ఎవరికి ఓటేశారో వైసీపీ నేతలకు ఎలా తెలుసంటూ ఆనం రాంనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో ఇంచార్జీని పెట్టినరోజే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నానని.. కావాలనే అగ్గిరాజేశారంటూ మండిపడ్డారు.

తాను మంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడేవాడినని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. తమ జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై తాను మాట్లాడినట్టుగా గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించి నిధులు నిలిచిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడం లేదని చెప్పినందుకే తనను పక్కన పెట్టారన్నారు. తన నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్ చార్జీగా పెట్టారని ఆయన చెప్పారు. తమను విమర్శించే వాళ్లను పార్టీ నుండి తప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ను సాకుగా చూపారని ఆయన విమర్శించారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలను, మంత్రులను గౌరవించేవారన్నారు.

కానీ జగన్ పాలనలో ఆ పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ప్రజల అవసరాల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. టీడీపీతోనే తన రాజకీయం మొదలైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా ఎన్నికల కమిషన్ ను చెప్పమనాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. క్రాస్ ఓటింగ్ చేశానో లేదా తాను చెప్పాలన్నారు. కానీ ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. అధికారుల మెడపై కత్తిపెట్టి పనిచేయడం సరికాదన్నారు.. సీబీఐ, ఈడీ కేసులు ఎదర్కోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. కుటుంబ సభ్యులను హత్య చేయడానిక తాను రాజకీయాల్లోకి రాలేదని ఆయన విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైకాపాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మరి సజ్జల ఈ వ్యాఖ్యల పట్ల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version