Twitter Blue Tick: ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ తాజాగా బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ రుసుము చెల్లించని కారణంగా.. సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఖాతాల బ్లూ బ్యాడ్జ్ ను తొలిగించిన విషయం తెలిసిందే. కేవలం బ్లూ టిక్ సర్వీస్‌లకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే బ్లూ మార్క్ ఇచ్చింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు బ్లూ టిక్‌ను కోల్పోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లూ టిక్ ను అందించే విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
మళ్లీ బ్లూ బ్యాడ్జ్ ప్రత్యక్షం
ట్విటర్ లో కనీసం 10 లక్షల మంది( 1 మిలియన్) ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు బ్లూ టిక్ ను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బ్లూ బ్యాడ్జ్ పోయిన చాలా మంది సెలెబ్రిటీల ఖాతాల్లో ఆదివారం తిరిగి బ్లూ టిక్ కనిపించింది. బాలీవుడ్ సెలబ్రెటీలు షారుక్ ఖాన్, అలియా భట్, టీమిండియా క్రికెటర్లు కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ సహా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ బిల్ గేట్స్, రాజకీయ ప్రముఖులు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి వారి ట్విటర్ ఖాతాలన్నింటికీ ఇప్పుడు బ్లూ బ్యాడ్జ్ కనిపించడం గమనార్హం. అయితే, వీరంతా డబ్బులు చెల్లించి ట్విటర్ బ్లూ సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారా? అనేది ఎలాంటి స్పష్టత లేదు.
చనిపోయినవారి ఖాతాలు సైతం
ఇలా ట్విటర్ బ్లూ టిక్ పొందిన వారిలో దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రిషి కపూర్, మైకేల్ జాక్స్, బాస్కెట్‌బాల్ ఆటగాడు కోబే బ్రయంట్, క్రికెటర్ షేన్ వార్న్ లాంటి ప్రముఖుల ఖాతాలు ఉన్నాయి. వారి ట్విటర్ టిక్ పై క్లిక్ చేసినపుడు వారు సబ్ స్రైబ్ చేసుకుని డబ్బులు చెల్లించారని కనిపిస్తోంది. అయితే, ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేకు ట్విటర్‌లో 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఆయన ఖాతాకు మాత్రం ఇప్పటికీ బ్లూ టిక్ కనిపించడం లేదు. కాగా, పలువురు ట్విటర్ ఖాతాలను వ్యక్తిగతంగా తానే డబ్బులు చెల్లించి ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవలను అందిస్తున్నట్టు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ తెలిపారు. లెబ్రాన్ జేమ్స్, విలియం శాట్నర్, స్టీఫెన్ కింగ్.. వారి ఖాతాలకు తానే స్వయంగా డబ్బులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. అయితే వీరంతా ట్విటర్ బ్లూను సబ్‌స్క్రైబ్ చేసుకోబోమని ప్రకటించారు.