Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో ఏరో షో ను నేడు మోదీ ప్రారంభించారు. బెంగళూరులో ‘ది రన్‌వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్’ అనే థీమ్ పేరుతో ఈ వైమానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ఎయిర్ షో నేటి నుండి 17 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో.. విదేశీ రక్షణ సంస్థల మధ్య 75,000 వేల కోట్ల పెట్టుబడుల అంచనాతో పలు దేశాలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.
బెంగళూరు ఎలహంక ఎయిర్ బేస్‌లో ఏరో ఇండియా ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా.. దేశీయ విమాన రంగాన్ని ఈ ప్రదర్శన ఎలివేట్ చేస్తోంది. ఇందులో విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో 32 దేశాల రక్షణ మంత్రులు.. 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొన్నారు. ఇందులో మొత్తం 115 కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ విన్యాసాలను మోదీ తిలకించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు.. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక సీఎం పాల్గొన్నారు.
నవ భారత సామర్థ్యాలను చాటిచెప్పేందుకు బెంగళూరు గగనతలం వేదికైందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన రాబోయే రోజుల్లో ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందని తెలిపారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదని.. భారతదేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని అన్నారు. భారత్ పై ప్రపంచం నమ్మకంతో ఉందన్నారు. అందుకే దాదాపు 100దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయని మోదీ అన్నారు. ఈ ప్రదర్శనతో విదేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా భారత్ మారిందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శనలతో భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ముందుకు సాగుతుందని వివరించారు.
ఈ ప్రదర్శన నేటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించారు. ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత్, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.