Site icon Prime9

చిక్కుల్లో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

imran-khan

పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై టెర్రరిజం చార్జీ ఫైల్‌ చేయడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది .గత శనివారం నాడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అధికారులను, జడ్జిలను బెదిరించారని, సైన్యాన్ని తిరుగుబాటు చేయాలని రెచ్చగొట్టారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తనను అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనను గురువారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఇమ్రాన్‌ ఖాన్‌పై టెర్రరిజం కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు ఇస్లామబాద్‌ పోలీసులు. ఖాన్‌కు చెందిన పిటిఐ నాయకులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖాన్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు వస్తే వేలాది మంది కార్యకర్తలు ఖాన్‌ ఇంటి చుట్టుముట్టి … అరెస్టు కాకుండా నిరోధించాలని కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐటిఐ కార్యకర్తలు ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటికి తరలివస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ సహచరుడు షెహబాజ్‌ గిల్‌ను అరెస్టు చేయడంతో ఖాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిల్‌ అరెస్టును నిరసిస్తూ.. గత శనివారం నాడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉన్నతాధికారులు, జడ్జిలపై విరుచుకుపడ్డారు. దీంతో పాక్‌ ఐజీ వెంటనే ఇమ్రాన్‌ఖాన్‌కు నోటీసులు పంపారు. టెర్రరిజం చార్జీలు నమోదు చేశారు. వెంటనే ఆయన ఇస్లామాబాద్‌ కోర్టును ఆశ్రయించి తాత్కాలిక బెయిల్‌ తెచ్చుకున్నారు. గురువారం ఆగస్టు 25 తో బెయల్‌ గడువు ముగుస్తుంది.

అయితే పాకిస్తాన్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ రానా సనాహుల్లా మాత్రం ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు చేసి జైలుకు పంపించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయన మూడు రోజుల ప్రొటెక్టివ్‌ బెయిల్‌ ముగిసిన వెంటనే ఈనెల 25న అరెస్టు చేయడం తథ్యమని చెబుతున్నారు రానా సనాహల్లా. కాగా సోమవారం ఖాన్‌ ఇస్లామబాద్‌ హైకోర్టును ఆశ్రయించి తాత్కాలిక బెయిల్‌ పొందినా…. కోర్టు మాత్రం యాంటీ టెర్రరిజం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇదిలా ఉండగా పాక్‌ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే. రానా సనాహుల్లా ప్రధానమంత్రి షహెబాజ్‌ షరీఫ్‌ కార్యాలయానికి లేఖ రాసి టెర్రరిజం కేసు కింద ఖాన్‌ను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం రానా సనాహుల్లా మాత్రం ఖాన్‌ బెయిల్‌ ముగిసిన వెంటను అరెస్ట చేస్తామని స్పష్టంగా చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లేనని భావించాల్సి వస్తుంది.

ఇమ్రాన్‌పై యాంటీ టెర్రరిజం యాక్ట్‌ సెక్షన్‌ 7 కింద కేసు నమోదు చేశారు. గత శనివారం నాడు ఇస్లామబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి పోలీసు అధికారులను , మహిళా జడ్జిను బెదరించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన సహచరుడు షెహబాజ్‌ గిల్‌ను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఆరోపించారు. ఖాన్‌కు వ్యతిరేకంగా ఫైల్‌ చేసిన కేసులో ఇస్లామబాద్‌ ర్యాలీలో ఆయన పోలీసు ఉన్నతాధికారులను మహిళా అదనపు సెషన్‌ జడ్జిని బెదిరించారని… తమ విధులనుంచి తప్పుకోవాలని ఆయన బెదరించారని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు రానా సనాహుల్లా న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి ఖాన్‌పై ఎలాంటి కేసులు నమోదు చేయాలో అడిగి సలహా తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగం అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా ఉందని, సైన్యాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పురికొల్పారని షెహబాజ్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఇమ్రాన్‌ఖాన్‌ మహిళా సెషన్‌ జడ్జిని బెదిరించారని ఆరోపణలపై ఇస్లామబాద్‌ హైకోర్టు విచారణకు స్వీకరించడంతో ఖాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. కోర్టు ఈ రోజు కేసును విచారణకు స్వీకరించింది. దీనికి సంబంధించి కోర్టు ఖాన్‌కు నోటీసు కూడా పంపింది. దీంతో పాటు ఆయన టెర్రర్‌ కేసును కూడా ఎదుర్కొంటున్నారు. శనివారం నాడు ఇస్లామబాద్‌లోని ఎఫ్‌-9 పార్కులో జరిగిన భారీ బహిరంగం సభలో ఆయన ఆవేశంగా మాట్లాడుతూ ఇస్లామాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసులిద్దరిపై కేసు నమోదు చేస్తానని, మీ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అటు తర్వాత తన ఆగ్రహాన్ని జ్యుడిషియరీ వైపు మళ్లించారు. తమ పార్టీపై న్యాయవాదులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీరు తవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటు తర్వాత ఖాన్‌ తన సహచరుడు షాబాజ్‌గిల్‌ను రెండు రోజు పోలీసు కస్టడీకి పంపించిన అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి జెబా చౌదరిని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని మహిళా జడ్జిని ఉద్దేశించి బెదిరించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఖాన్‌.

గత శనివారం నాటి భారీ బహిరంగ సభ అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిందనేది వాస్తవం. ఇటీవల పంజాబ్‌ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పిటిఐ భారీ మెజారిటీ సాధించింది. దీంతో రెచ్చిపోయిన ఖాన్‌ దేశవ్యాప్తంగా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు. సభలు, సమావేశాలు పెట్టి అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం షరీఫ్‌ ప్రభుత్వం ఖాన్‌కు గట్టి షాక్‌ ఇచ్చే ఆలోచనలో ఉంది. బహుశా ఆయనపై కేసుల మీద కేసులు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది ఇస్లామబాద్‌ పొలిటికల్‌ టాక్‌.

Exit mobile version