Site icon Prime9

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు

Imran Khan

Imran Khan

Pakistan: పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. తోషాఖానాకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసినందుకు సరైన సమాచారం ఇవ్వనందుకు ఆర్టికల్‌ 63 (1) (P) ప్రకారం అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయంతో దేశంలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అధికారపక్షం మాత్రం ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పడు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన ఖరీదైన బహుమతులను ట్రెజరీలో జమ చేయకుండా తన ఇంటికి తరలించుకుపోయారని, అటు తర్వాత ఖరీదైన బహుమతులను అమ్ముకొని సొమ్ముచేసుకున్నారని ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ అవినీతికి సంబంధించిన నేరాలని షరీప్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి చెబుతున్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌ పై ఎలక్షన్‌ కమిషన్‌ అనర్హత వేటు వేసిన వెంటనే పాకిస్తాన్‌లోని లాహోర్‌, ఇస్లామాబాద్‌, పెషావర్‌, కరాచీల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలను రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాలని ఖాన్‌ పార్టీ పిటిఐ ప్రజలను కోరింది. అనర్హత వేటు పై ఇమ్రాన్‌ స్పందిస్తూ, తాను చేపట్టిన హఖీఖి ఆజాదీ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని అనర్హత వేటు వేసిందని మండిపడ్డారు. ఎలక్షన్‌ కమిషన్‌ తీర్పు 22 కోట్ల మంది పాకిస్తాన్‌ ప్రజల పై చెంప పెట్టులాంటిదని ఖాన్‌ పార్టీకి చెందిన ఫవాద్‌ చౌదరీ అన్నారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ న్యాయవాది ఘోహర్‌ఖాన్‌ మాత్రం ఈసీ రూలింగ్‌ను హైకోర్టు సవాలు చేస్తామని చెప్పారు.

ఈసీ నిర్ణయం ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఆదివారం నాడు జరిగిన ఉప ఎన్నికల్లో అధికారపార్టీని ఖాన్‌ మట్టి కరిపించారు. జులైలో జరిగిన పంజాబ్‌ ఉప ఎన్నికల్లో కూడా షరీప్‌ పార్టీని ఘోరంగా ఓడించారు. ఈ రెండు ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మాజీ ప్రధానమంత్రి ఖాన్‌కు ప్రజల్లో మంచి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్‌లో లాయర్లు, జర్నలిస్టులు, మేధావులు ఈసీ తీర్పు హాస్యాస్పందంగా ఉందని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌ ఇంటిరియర్‌ మినిస్టర్‌ రాణా సనాహుల్లా శాంతియుతంగా నిరసన తెలపాలని పిటిఐ కార్యకర్తలను కోరారు. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Exit mobile version
Skip to toolbar