Viral News: : కుక్కని పోలిన జంతువు నక్క. అయితే చిన్నపిల్లగా ఉన్నప్పుడు నక్క పిల్లకి, కుక్క పిల్లకి పెద్దగా తేడా తెలియదు. అలా ఓ ఫ్యామిలీ కుక్క అనుకుని పెంచుకున్నారు. తీరా చూస్తే అది నక్క అని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఖంగుతినింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇలాంటి ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా..
దక్షిణ అమెరికా దేశమైన పెరూ రాజధాని లిమాలో ఉండే ఓ ఫ్యామిలీ ఓ కుక్క పిల్లను కొన్నారు. అది మిగతా కుక్కల లాగా కాకుండా కాస్త వరైటీ జాతిదిలా ఉందని చాలా ముద్దుగా దాన్ని పెంచుకున్నారు. అది ఎప్పుడూ చాలా చలాకీగా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉండటం వల్ల ఆ కుక్కకి రన్ రన్ అని పేరు కూడా పెట్టారు. చుట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని చూసి తెగ ముచ్చట పడేవారు. అయితే ఓ 6 నెలల తర్వాత ఆ కుక్క చుట్టుపక్కల వాళ్లు పెంచుకుంటున్న కోళ్లు, బాతుల్ని వెంటాడి, వేటాడి తిటుండడంతో ఇరుగుపొరుగు వాళ్లు దానిపై ఆ కుటుంబానికి ఫిర్యాదులు చేసేవారు. కాగా ఓ రోజు అది రాత్రివేళ నక్కలా అరవడం చూసి దాన్ని పెంచుకుంటున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇన్నాళ్లూ తాము పెంచుకున్నది కుక్క కాదని, నక్క అని అర్థమైంది. వెంటనే దాన్ని బంధించారు. కాగా అది అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పెరూలో అధికారులు ఆ నక్క కోసం వెతుకుతున్నారు.
కర్ణాటకలోనూ ఇదే తరహా ఘటన
కర్ణాటకలోని కెంగేరిలో ఉంటున్న ఆ కుటుంబ సభ్యులు అందరికీ డాగ్స్ అంటే మక్కువ ఎక్కువే. దానితో రోడ్డుపై తమకు దొరికిన ఓ కుక్క పిల్లను ఇంటికి తీసుకువచ్చారు.
ఆరు నెలలుగా దాన్ని తమ సొంత బిడ్డగా పెంచుకుంటూ వచ్చారు. వయసు పెరిగే కొద్దీ అది పెరగకుండా, రాత్రివేళల్లో విచిత్రమైన శబ్దం చేస్తూ వచ్చింది. దానితో ఆ ఇంటికి వచ్చిన అతిథులంతా ఇదేంటి మీ కుక్క నక్కలాగా ఉందని అంటూ ఉన్నా వారు పట్టించుకోలేదు. కాగా అది ఓ రోజు ఊళ వేస్తుండడంతో గమనించిన వారు తాము పెంచుకుంటున్నది నక్కేనని కన్ఫర్మ్ చేసుకున్నారు. పాలు తాగకపోవడం, మాంసాహారాన్ని ఇష్టంగా తినడం చూసి దాన్ని నక్కే అని తెలుసుకుని ప్రాణిదయా సంఘం ప్రతినిధులకు ఈ విషయాన్ని చేరవేశారు. దానితో వారు దానిని బంధించి తీసుకువెళ్లి నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఇదీ చదవండి: నీట మునిగిన ఉత్తర భారతం.. యూపీలో 9 మంది మృతి