World Obesity Day: తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు అధిక బరువు, ఊబకాయం వల్ల మధుమేహం బారినపడే ప్రమాదం 73 శాతంగా ఉన్నట్టు ఆ సర్వే తేల్చింది.
దేశంలోని 600 ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని ఐసీఎమ్ఆర్, ఎన్ఐఎన్ సర్వే చేశాయి. దేశ వ్యాప్తంగా 600 ప్రాంతాల్లో ఈ సర్వే చేశారు.
65 శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులే కారణం(World Obesity Day)
ఆ సర్వే ప్రకారం.. పట్టణాల్లో 34 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నట్టు తేలింది. రక్తపోటు ఎక్కువగా పురుషులే అధికంగా ఉన్నరని సర్వే వెల్లడించింది.
దీర్ఘకాలిక వ్యాధులతో 2019 లో దాదాపు 61 లక్షల మంది మరణించారనేది సర్వే చెప్పిన సమాచారం.
వారిలో ఎక్కువగా డయాబెటిస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1.70 లక్షలు. దీర్ఘకాలిక వ్యాధులే దేశంలోని 65 శాతం మరణాలకు కారణమని బయటపడింది.
మరో వైపు దేశంలో పోషకాహార లోపం కూడా ఉన్నట్టు సదరు సర్వే వెల్లడించింది.
98.4 శాతం మంది సరిపడా కూరగాయలు, పండ్లు తినడం లేదని.. సర్వేలో పాల్గొన్న 41 శాతం మంది తాము శారీరక శ్రమ చేయట్లేదని పేర్కొన్నారట.
దీని వల్ల 2040 నాటికి దేశంలో ఊబకాయుల సంఖ్య మూడింతలయ్యే ప్రమాదం ఉందని సదరు సంయుక్త సంస్థలు హెచ్చరించాయి.
దేశంలో ధూమపానం అలవాటు ఉన్న వారు 32.8 శాతం కాగా, మద్యపానానికి బానిస అయిన వాళ్లు 15.9 శాతంగా ఉన్నట్టు తేలింది.
ప్రతి ఏట మార్చి 4 న
ప్రతి ఏట మార్చి 4 న ప్రపంచ స్థూలకాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఊబకాయం గురించి చర్చించుకునేందుకు.. దానిపై అవగాహన కల్పించేందకు ఈ రోజును జరుపుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 1975 నంచి ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది.
కాబట్టి దీని గురించి ఆవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమనేది డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
పెద్దల్లోనే కాకుండా.. చిన్నారులలోనూ ఈ ఊబకాయ సమస్య ఎక్కువ అవుతోంది.
డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం, 2020 లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 39 మిలియన్ పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు.
అధిక బరువుతో బాధపడే పిల్లల దేశాల జాబితాలో వరల్డ్ లో భారత్ రెండో స్థానంలో ఉంది.
ఇటీవల చేపట్టిన అధ్యయనం ప్రకారం దేశంలో 14.4 మిలియన్ల పిల్లలు అధికబరువుతో ఉన్నట్లు తేలింది.
పిల్లల్లో ఊబకాయం కారణంగా గుండె సమస్యలు, నిద్రపోతున్నపుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కీళ్ల సమస్యలు, డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది.
అదే విధంగా సదరు పిల్లలు పెద్దయ్యాక కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారులు అధిక బరువు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
కారణాలు ఇవే
ప్రపంచంలో ప్రస్తుతమున్న ఊబకాయ సమస్య మరింత దిగజారకముందే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తగినంత శారీర శ్రమ లేకపోవడం, అనారోగ్యపు అలవాట్లు, టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోవడం చిన్నారుల్లో ఊబకాయానికి కారణమవుతాయి.
పిల్లల్లో ఈ సమస్యకు ప్రధాన కారణం.. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీర శ్రమ తగ్గడం, ఆహార సరఫరా, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, పోషక విలువలు లేని ఆహారం,
కేలరీలు ఎక్కువగా తీసుకోవడం, మార్కెటింగ్ విధానాల్లో లోపాలు, బరువు నిర్వహణ, ఆరోగ్య విద్యలో తక్కువ వనరులతో కూడిన సేవలు ఈ సమస్య పెరుగుదలకు కారణమవుతాయని ఓ నివేదిక తెలిపింది.