Sarath Babu: సీనియర్ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్య కారణాలతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. శరీరం అంతా ఇన్ ఫెక్షన్ కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతినడంతో ఆయన మృతి చెందినట్టు ఏఐజీ వైద్యులు వెల్లడించారు. శరత్ బాబు మరణ వార్త విని సినీ ప్రముఖలు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు. శరత్‌బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
దాదాపు 250 పైగా చిత్రాల్లో..(Sarath Babu)
1973లో విడుదలైన ‘రామరాజ్యం’తో శరత్‌బాబు హీరోగా పరిచయం అయ్యారు. రెండో సినిమా కోసం విలన్‌గా నటించి.. హీరోగా కాకుండా విలన్, సహాయనటుడిగా సుమారు 250 కు పైగా చిత్రాల్లో నటించారు. మరో చరిత్ర, గుప్పెడు మనసు, శృంగార రాముడు, ఇది కథ కాదు, 47 రోజులు, సీతాకోక చిలుక, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, సాగరసంగమం, సంసారం ఒక చదరంగం, క్రిమినల్, అన్నయ్య.. ఇలా ఎన్నో సినిమాలు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. శరత్‌బాబు సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌తోనూ గుర్తింపు పొందారు. అప్పట్లో ఈటీవీలో వచ్చిన ‘అంతరంగాలు’సీరియల్ ఆయనకు టీవీ ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసింది. శరత్ బాబు నటి రమాప్రభను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా పెళ్లి అయిన కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు సుశీలాదేవిల కుమారుడు శరత్‌బాబు. ఆయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు. అనుకోకుండా ఆయన నాటక రంగం వైపు వచ్చారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆయన ఎన్నో నాటకాలు వేశారు.