Site icon Prime9

Indira Devi: మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత

maheshbabu-mother-indiradevi-passed-away

Mahesh Babu :టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి కాలంచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్న మహేశ్ బాబు తల్లి ఇవాళ తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య. వీరికి ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేశ్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. కృష్ణ రెండో భార్య విజయ నిర్మల 2019లో చనిపోయారు. కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు 2022 జనవరి 8 న మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఇందిరా దేవి మృతి పట్ల సినీ,రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఇందిరాదేవి పార్థివదేహాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.

మహేష్ బాబుకు తన తల్లితో విడదీయలేనంత అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో తన తల్లి గురించి చాలా సార్లు ఎమోషనల్‌గా చెప్పారు. నాకు మా అమ్మ దేవుడి లాంటి వారు. నేను ఏదైనా టెన్షన్ లేదా నెర్వస్‌గా ఉంటే ఆమె ఇంటికి వెళ్తుంటాను. ఆమె చేతితో కాఫీ తాగితే అన్ని టెన్షన్లు మాయం అవుతాయి. అలాంటి బంధం మా అమ్మతో ఉందని మహేష్ పలు మార్లు చెప్పారు. అంతేకాదు పలు ముఖ్యమైన రోజులు. సందర్బాల్లో తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఏడాదిక్రితం మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఆ సమయంలో తనకు కరోనా సోకడంతో తన అన్నను చివరిచూపు కూడ మహేష్ బాబు చూసుకోలేకపోయారు. తన పినతల్లి, దర్శకురాలు విజయ్ నిర్మల స్వర్గస్తులయ్యారు. తనకు ఇష్టమైన జర్నలిస్టు బీఏ రాజు కూడా మరణించారు. ఇలా గత కొద్దకాలంగా మహేష్ బాబు జీవితంలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Exit mobile version