Site icon Prime9

Mahesh Babu Birthday Special: హ్యాపీబర్త్ డే సూపర్ స్టార్

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే కాదు దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఆయన ఒకరు. అతను స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన నటనా నైపుణ్యంతో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మహేష్ బాబు ఈ రోజు తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

మహేష్ బాబు ఆగష్టు 9, 1975న సూపర్ స్టార్ కృష్ణ మరియు ఇందిరాదేవికి జన్మించారు. మహేష్ తన నటనా జీవితాన్ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. చిన్నవయస్సులోనే విపరీతమైన ప్రజాదరణ పొందారు. అయితే డిగ్రీ పూర్తయిన తరువాతే సినిమాను కెరీర్ గా ఎంచుకోవాలని తండ్రి చెప్పిన మాటతో చదువు పై దృష్టి కేంద్రీకరించారు.

1999లో విడుదలైన రాజకుమారుడు సినిమాతో మహేష్ హీరోగా తెరంగేట్రం చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి అతనికి ‘ప్రిన్స్’ అనే ట్యాగ్‌ని తెచ్చిపెట్టింది. కెరీర్‌లో ప్రాథమిక దశలో మురారి, ఒక్కడు మరియు అతడు వంటి సూపర్ హిట్‌లను అందుకున్నారు. మహేష్‌ను సూపర్‌స్టార్‌గా నిలిపిన చిత్రం పోకిరి, ఇది 2006లో విడుదలైంది. ఆ తర్వాత, దూకుడు, బిజినెస్ మేన్ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు వంటి వివిధ బ్లాక్‌బస్టర్‌లను అందించారు. మహేష్ కెరీర్‌లో ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అతను ఎనిమిది నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు నాలుగు SIIMA అవార్డులు అందుకున్నారు. మహేష్ బాబు చివరిసారిగా నటించిన సర్కారు వారి పాట, ఇది బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా మిగిలిపోయింది.

మహేష్ బాబు నటుడిగానే కాదు, తన సేవా కార్యాక్రమాలతో బిజీగా వున్నారు. రెండు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తున్నారు. గ్రామస్తులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు వేయించడం, చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహేష్ త్వరలో అగ్రదర్శకులు త్రివిక్రమ్, రాజమౌళితో కలిసి పనిచేయబోతున్నారు. ఈ రోజు అతని బర్త్ డే సందర్బంగా టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version